ఫాస్టాగ్‌తో నేరగాళ్లనూ పట్టుకోవచ్చు!
జాతీయ రహదార్లపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుము ఎలక్ట్రానిక్ పద్ధతిలో వసూలు చేసేందుకు నిర్ధేశించిన ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది కేంద్రం. ప్రస్తుతానికి టోల్ ఫీజుకు మాత్రమే పరిమితమైనా.. భవిష్యత్‌లో ఫాస్టాగ్ చాలా అవసరాలకు కీలకంగా మారనుంది.
అంతే కాకుండా నేరగాళ్లను పట్టుకునేందుకు ఉపయోగపడనుంది. మునుముందు ఫాస్టాగ్‌తో ఎలాంటి ఉపయోగాలున్నాయనే విషయాలు మీ కోసం. దోపిడీలు, హత్యలు చేసి ఏ లారీలోనో లేక కార్లోనో పారిపోదామనుకుంటే ఇక కుదరదు. ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రానికి తప్పించుకొని వెళ్లే అంతర్రాష్ట్ర ముఠాల ఆటలు కూడా సాగకపోవచ్చు.
నేరస్థులు తప్పించుకుని పారిపోయే క్రమంలో వాహనాన్ని వినియోగించారా.. సులువుగా పట్టుబడిపోతారు. దీనికి కారణం వాహనాలకు ముందుభాగాన అద్దంపై ఉండే 'ఫాస్టాగ్'...! జాతీయ రహదార్లపై టోల్‌గేట్ల వద్ద ఎలక్ట్రానిక్ పద్ధతిలో రుసుము చెల్లించేందుకు రూపొందించిన 'ఫాస్టాగ్' భవిష్యత్తులో నేరపరిశోధనలో క్రియాశీలకం కానుంది. నేటినుంచి వాహనాలకు తప్పనిసరి 'ఫాస్టాగ్' అమల్లోకి వస్తోంది
వాహనదారులు తీవ్ర ఇక్కట్లు
దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ విధానం ఆదివారం నుంచి అమలులోకి రావడంతో యాదాద్రి, పంతంగి టోల్‌గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టోల్‌గేట్ దగ్గర ఇరువైపులా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫాస్టాగ్ విధానం అమలుతో నగదు చెల్లింపు కౌంటర్లు కుదింపు చేశారు. ఫాస్టాగ్ కార్డు లేని వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.