మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (14:05 IST)

స్నాక్స్ కోసం ఫోన్ చేసి రూ.2.25 లక్షలు సమర్పించుకున్న పారిశ్రామికవేత్త!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పారిశ్రామికవేత్త ఒకరు సైబర్ నేరగాడి చేతిలో మోసపోయాడు. చిరుతిళ్ల కోసం ఫోన్ చేసి ఏకంగా 2.25 లక్షల రూపాయలను సమర్పించుకున్నాడు. ఈ ఘటన ముంబై నగరంలో తాజాగా వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ పారిశ్రామికవేత్త(40) ఆన్‌లైన్‌లో ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులతో పాటు రూ.400 విలువైన చిరుతిళ్లను ఆర్డర్‌ చేశాడు. 
 
అయితే, ఆయన ఆర్డరిచ్చినట్టుగానే కిరాణా సరుకులు మాత్రం ఇంటికి చేరాయి. కానీ, స్నాక్స్ మాత్రం రాలేదు. దీంతో తాను ఆర్డర్‌ చేసిన వెబ్‌సైట్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను నెట్‌లో వెతికాడు. ఒక సైబర్‌ నేరగాడు నెట్టింట పెట్టిన నకిలీ నెంబర్‌ను వెబ్‌సైట్‌ నెంబర్‌ అనుకుని దానికి కాల్ చేశాడు. ఇదే పారిశ్రామికవేత్త చేసిన పొరబాటు. 
 
అంతే... అటువైపున ఫోన్ తీసిన సైబర్ నేరగాడు.. ఈ పారిశ్రామికవేత్త నుంచి అన్ని వివరాలను సేకరించాడు. ఈయన వెల్లడించిన వివరాల్లో బ్యాంకు ఖాతా నంబరు, ఫోన్‌ నెంబరు‌, ఏటీఎం కార్డు సీవీవీ సంఖ్య కూడా ఉన్నాయి. 
 
ఆ తర్వాత తాను మొబైల్ నంబరుకు ఓ లింకు పంపుతానని దాన్ని తన ఫోన్‌కు ఫార్వార్డ్‌ చేయాలని సైబర్ నేరగాడు కోరగా, ఈ పారిశ్రామికవేత్త అలానే చేశాడు. అంతే.. కేవలం రెండు గంటల వ్యవధిలో పారిశ్రామికవేత్త ఖాతా నుంచి ఏకంగా రూ.2.25 లక్షల నగదును మాయం చేసేశాడు. 
 
అప్పటికి గానీ తాను మోసపోయానన్న విషయం అర్థం కాని పారిశ్రామికవేత్త, వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఫోన్‌కాల్స్‌, సందేశాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బ్యాంకు వివరాలు, కార్డు సీవీవీ, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని కోరుతున్నారు.