ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (15:01 IST)

యోగి ఆదిత్యనాథ్ తండ్రి మృతి.. కడసారి చూపుకు నోచుకోని సీఎం

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సంతాపాలు వెల్లువెత్తున్నాయి. 89 ఏళ్ల ఆనంద్ సింగ్ బిష్త్.. కాలేయం, మూత్రపిండాల సమస్యలతో ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనీ.. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పేర్కొన్నారు. 
 
డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య కూడా ట్విటర్లో సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాదం నుంచి వారి కుటుంబం త్వరగా కోలుకోవాలని భవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు తండ్రి మరణానికి తీవ్రంగా దు:ఖిస్తున్నానని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
 
అయితే కరోనా మహమ్మారి కారణంగా తాను అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన తండ్రి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 
 
యోగి తండ్రి భౌతిక కాయాన్నిఉత్తరాఖండ్‌లోని పౌరీ గ్రామానికి తరలించారు. మంగళవారం ఉదయం అంతిమ సంస్కారాలు జరుగుతాయని ఆయన తరపు బంధువులు ప్రకటించారు.