గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:47 IST)

కత్తెర పట్టిన మంత్రి.. కొడుకు - కుమార్తెకు స్వయంగా కటింగ్

దేశ వ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో నిత్యావసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. అలాంటి వాటిలో బార్బర్ షాపులు కూడా ఒకటి. దేశ వ్యాప్తంగా సెలూన్లు మూతపడివున్నాయి. దీంతో ఓ మంత్రి స్వయంగా కత్తెరపట్టారు. తన కుమార్తెకు కటింగ్ చేశారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కత్తెర పట్టిన మంత్రి పేరు సతీశ్. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక విద్యాశాఖా మంత్రిగా సతీశ్ ద్వివేదీ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా సెలూన్ షాపులు మూతపడటంతో తన ఇద్దరు పిల్లలకు కటింగ్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. కత్తెర పట్టుకుని తన నాలుగున్నరేళ్ళ కుమార్తెతోపాటు.. ఎనిమిదేళ్ళ కుమారుడికి కటింగ్ చేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఇక్కడో విషయం గమనించాలి. మరి కటింగ్ అంటే మాటలు కాదు కదా. అనుభవం లేని వారు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ, కూతురి కటింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడినా కుమారుడి దగ్గరకు వచ్చిసరికి చేయి తిరిగిన నిపుణుడిగా మారిపోయారు. దిగ్విజయంగా క్షవరం పూర్తి చేశారు. 
 
'నా కుతురు సుకృతికి కటింగ్ చేసే సమయంలో కాస్త ఇబ్బంది పడ్డా. అయితే కుమారుడు కార్తికేయ వంతు వచ్చేసరికి మాత్రం పట్టు సాధించేశా' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి సతీమణి రికార్డు చేయగా.. ఆ వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 
 
మీ పనితనం పిల్లలకు నచ్చిందా అని మంత్రిని అడగ్గా వారి కంటే తనే ఎక్కువ కంగారుపడ్డానని సతీశ్ తెలిపారు. ఏ సమస్యా లేదు నాన్న అని కుమార్తె అన్నదని చెప్పారు. హెయిర్ స్టైల్ తేడాగా ఉంటుందేమోనని కుమారుడు తొలుత కాస్త టెన్షన్ పడ్డాడని అయితే ఇప్పుడు తనే.. 'మా నాన్నే నాకు కటింగ్ చేశారు' అని అందరికీ చెబుతున్నాడంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు.