ఉద్ధవ్ ఠాక్రే భవితవ్యంపై నీలినీడలు.. సీఎం పదవికి రాజీనామా తప్పదా?

uddhav thackeray
ఠాగూర్| Last Updated: మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (11:36 IST)
ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భవితవ్యంపై నీలి నీడలు నెలకొన్నాయి. దీంతో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రానికి సీఎంగా లేదా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారు, ఆరు నెలలోగా, ఉభయ సభల్లో దేనిలో ఒకదానిలో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాలి.

కానీ, మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రే.. అటు అసెంబ్లీ, ఇటు శాసనమండలిలో సభ్యుడు కాదు. దీంతో ఆయన సీఎం పదవి చేపట్టిన ఆర్నెల్లలోపు ఏదో సభ నుంచి ఎంపిక కావాల్సివుంది. కానీ, ఆయన సీఎం పదవి చేపట్టి ఐదు నెలలు అయింది. పైగా, ఆయనకు ఉన్న ఆర్నెల్ల గడువు మే 28వ తేదీతో ముగియనుంది.

ఏ ఎమ్మెల్యేతోనైనా రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని భావించినా, కరోనా కారణంగా ప్రస్తుతానికి ఎన్నికల గురించి ఆలోచించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రేను శాసనమండలికి నామినేట్ చేయాలంటూ మహారాష్ట్ర భగత్ సింగ్ కోష్యారీని మరోమారు మంత్రివర్గం అభ్యర్థించింది.

డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ ఈ మేరకు తీర్మానాన్ని గవర్నర్‌కు పంపింది. రెండు వారాల క్రితం కూడా ఇదే తరహా తీర్మానాన్ని గవర్నర్‌కు పంపినా, ఆయన దానిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి తీర్మానం గవర్నర్ ముందుకు వచ్చింది.

ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయమే కీలకం కానుంది. ఆయన ఉద్ధవ్ ఠాక్రేను నామినేట్ చేస్తారా? లేదా? అన్న విషయంపైనే సీఎం పదవి ఆధారపడి ఉండటంతో, మహారాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనన్న చర్చ సాగుతోంది. పైగా, మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు నియమించింది. దీంతో ఆయన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని తాము భావించడం లేదని శివసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.దీనిపై మరింత చదవండి :