మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:22 IST)

కుప్పలుతెప్పలుగా కరోనా కేసులు.. అయినా మద్యం షాపులు తెరుస్తారట...

దేశంలో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ప్రతి రోజూ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం 50 మందికి పైగా జర్నలిస్టులకు కూడా ఈ వైరస్ సోకింది. ఇక్కడ పరిస్థితులు దిగజారిపోతుంటే.. మహారాష్ట్ర సర్కారు మాత్రం మద్యం దుకాణాలు తెరిచేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తోంది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపె స్పందిస్తూ, 'ప్రజలు కనుక భౌతిక దూరాన్ని పాటించినట్లయితే మద్యం దుకాణాలను మూసేయాల్సిన అవసరం ఏముంది? కరోనాను కట్టడి చేయాలంటే కాస్త కఠినంగానే వ్యవహరించాలి. మద్యంపై నిషేధం అందులో భాగమే' అని వివరించారు. మహారాష్ట్రలో సోమవారం నుంచి పాక్షిక స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. 
 
లాక్‌డౌన్ వల్ల మద్యం బాబులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మందుకు దూరంగా ఉండలేక, అలా అని దాన్ని సాధించుకోలేక మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారు. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో వస్తున్న కేసులే ఇందుకు ప్రత్యక్ష ఉదహారణ. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దాదాపుగా దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.