శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (16:37 IST)

హడలెత్తిస్తున్న ఆ మూడు రాష్ట్రాలు - కొత్త కరోనా కేసుల్లో 45 శాతం అక్కడే..

కరోనా వైరస్ కేసుల నమోదులో మూడు రాష్ట్రాలు హడలెత్తిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా ఈ మూడు రాష్ట్రాలతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. మన దేశంలోనూ విజృంభిస్తోంది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. 
 
వైరస్ ఇంకా మూడో దశ (కమ్యూనిటీ ట్రాన్స్‌ మిషన్‌)కు రాకపోయినా గతవారం రోజుల నుంచి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. 
 
మన దేశంలో మార్చి 10 నుంచి 20 మధ్య పది రోజుల్లో కరోనా సోకిన వారి సంఖ్య 50 నుంచి 196కు చేరుకుంది. మార్చి చివరికి అది 1397కు పెరిగింది. ఏప్రిల్ ఆరో తేదీ నాటికి కరోనా పాజిటివ్ కేసులు 4281కి చేరాయి. అంటే గడచిన ఐదు రోజుల్లో వైరస్ వ్యాప్తి ఎలా పెరిగిందో ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మీట్‌లో జరిగిన మత సమ్మేళనమే కారణమని తేలింది. ఫలితంగా పలు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ నుంచే ఎక్కుగా ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు దేశంలో కొవిడ్-19కు హాట్ స్పాట్‌గా కనిపిస్తున్నాయి. 
 
దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల వాటా 43 శాతం ఉండటం గమనార్హం. ప్రస్తుతం మహారాష్ట్రలో 748, తమిళనాడులో 621, ఢిల్లీలో 523 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.