బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (09:09 IST)

మహారాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్ - కరోనా రహిత రాష్ట్రంగా త్రిపుర

మహారాష్ట్రను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఇపుడు.. ఆ రాష్ట్ర మంత్రుల్లో ఒకరికి సోకింది. ఆయన పేరు జితేంద్ర అవద్. రాష్ట్ర గృహ నిర్మాణశాఖామంత్రిగా ఉన్నారు. ఈయన వయసు 54 యేళ్లు. దీంతో ఆయన్ను థానేలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 
 
అలాగే, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మంత్రికి చెందిన 15 మంది కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌కు తరలించారు. వీరికి నిర్వహించిన పరీక్షా ఫలితాలు గురువారం రాగా, ఈ ఫలితాల్లో మంత్రికి మాత్రమే పాజిటివ్ అని తేలింది. 
 
ముంబ్రాలోని తబ్లిగీ జమాత్ సభ్యుల కోసం నిర్వహించిన ఆపరేషన్‌లో ఆ పోలీస్ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13 మంది బంగ్లాదేశీయులు, 8 మంది మలేషియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగానే ఆయనకు కరోనా సోకి ఉంటుందని, ఈ పోలీసు అధికారి మంత్రి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. దీంతో మంత్రికి వైరస్ సోకివుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 
 
కరోనా రహిత రాష్ట్రాల జాబితాలో త్రిపుర 
మరోవైపు, ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ఇపుడు కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అవతరించింది. దేశంలో కరోనా వైరస్‌ను తరిమికొట్టిన రాష్ట్రాల జాబితాలో గోవా, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాలు ఉండగా, ఇపుడు త్రిపుర కూడా చేరింది. 
 
తమ రాష్ట్రంలో ఇప్పుడు ఒక్క కరోనా కేసు కూడా లేదని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ స్వయంగా ప్రకటించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్రిపురలో కరోనా పాజిటివ్ వచ్చిన రెండో వ్యక్తి కూడా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. 
 
వ్యాధి సోకిన తొలి వ్యక్తిని క్వారంటైన్ చేసి చికిత్స అందించామని గుర్తు చేసిన ఆయన, అతనికి ఇప్పుడు నెగటివ్ వచ్చిందని, ఆపై రెండో వ్యక్తి ఆరోగ్యం కూడా కుదుటపడి, నెగటివ్ వచ్చిందని అన్నారు. కాగా, కరోనా కేసులు ఒక్కటి కూడా లేని రాష్ట్రాల్లో సిక్కిం, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కూడా ఉన్నాయి.