శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (11:31 IST)

ఏపీతో సహా మూడు రాష్ట్రాలను భయపెడుతున్న జవాద్ తుఫాను

జవాద్ తుఫాను మూడు రాష్ట్రాలను భయపెడుతుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలను ఈ తుఫాను అతలాకుతలం చేయొచ్చని భారత వాతావరణ శాఖ హెచ్చించింది. ముఖ్యంగా, ఈ తుఫాను ప్రభావం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా డిసెంబరు 4 నుంచి కురిసే భారీ వర్షాల వల్ల పంటలకు భారీ నష్టం సంభవించవచ్చని తెలిపింది. 
 
దక్షిణ థాయ్‌లాండ్‌‍లోని అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా ఏర్పడుతుందని ఐఎండీ వెల్లడించింది. ఇది డిసెంబరు 4వ తేదీ ఉదయం ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. 
 
ఈ తుఫాను తీరం దాటేముందు దక్షిణ అండమాన్ సముద్రం గుండా భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, శనివారం ఉదయం కోస్తా తీరంలో గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.