పెద్దల సభకు "ఆ ముగ్గురు"... విమర్శలకు ఫుల్‌స్టాఫ్
భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతల్లో ఓ ముగ్గురుని పెద్దల సభ రాజ్యసభకు పంపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. తద్వారా వీరికి లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించకుండా పక్కనబెట్టారన్న విమర్శలకు చెక్ పెట్టాలని వారిద్దరూ భావిస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఎల్కే అద్వానీ సీటు అయిన గాంధీ నగర్‌ను బీజేపీ చీఫ్ అమిత్ షాకు కేటాయించగా, మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి సీటు అయిన వారణాసిని ప్రధాని నరేంద్ర మోడీ కైవసం చేసుకున్నారు. అద్వానీ, జోషీలకు వయోభారం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో సీట్లు కేటాయించలేదు.
అలాగే, మరో సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ కూడా అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆమెకు కూడా సీటు కేటాయించలేదు. అయితే, ఈ ముగ్గురు సీనియర్లు ఎంతో అనుభవం ఉన్న నేతలు, వీరికి సీట్లు కేటాయించకపోవడంతో పార్టీలోనే కాదు బయటకూడా విమర్శలు చెలరేగాయి.
వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఉన్నారు. ఇందులోభాగంగా, ఆ ముగ్గురు నేతలను పెద్దల సభకు నామినేట్ చేయాలన్న భావనలో ఉన్నారు. తద్వారా విమర్శలకు చెక్ పెట్టొచ్చన్నది వారిద్దరి ఆలోచనగా ఉంది. ఇదే విషయంలో ఈ వారంలో జరిగే పార్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.