బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:02 IST)

యూపీలో ద్రౌపది వస్త్రాపహరణం.. మౌనంగా భీష్ముడు : సుష్మా స్వరాజ్

తమ పార్టీ మహిళా నేత, సినీ నటి జయప్రదను లక్ష్యంగా చేసుకుని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఘాటుగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతోందని, ఎస్పీ పూర్వ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాత్రం భీష్ముడిలా మౌనంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆమె ట్వీట్ చేశారు. 'ములాయం సింగ్‌ యాదవ్ భాయ్‌... మీరు సమాజ్‌ వాదీ పార్టీకి పెద్ద దిక్కు. మీకు సమీపంలోనే ఉన్న రాంపూర్‌లో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది. మీరు మాత్రం భీష్ముడి మాదిరి మౌనం వహించి పొరపాటు చేయవద్దు' అని సుష్మా స్వరాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఇదేసమయంలో ఆజంఖాన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్‌ చేశారు. జయప్రద అసలు స్వరూపాన్ని తెలుసుకునేందుకు రాంపూర్ ప్రజలకు 17 సంవత్సరాలు పట్టిందని, తాను మాత్రం 17 రోజుల్లోనే ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుందని గుర్తించానని ఆజంఖాన్ వ్యాఖ్యానించడంపై మహిళా కమిషన్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.