ఢిల్లీ - చెన్నైల మధ్య తగ్గనున్న 300 కిలోమీటర్ల దూరం.. ఎలా?
దేశ రాజధాని ఢిల్లీ, ఆటోమొబైల్ హబ్ చెన్నై నగరాల మధ్య దూరం ఏకంగా 300 కిలోమీటర్ల మేరకు తగ్గనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా ఈ రెండు ప్రాంతాల మధ్య కొత్త జాతీయ రహదారిని నిర్మిచనున్నారు. ఇది పూర్తయితే ఈ ప్రాంతాల మధ్య దూరం ఏకంగా 300 కిలోమీటర్ల మేరకు తగ్గుతుందని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖామంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ప్రస్తుంత ఢిల్లీ - ముంబై ప్రాంతాల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం సాగుతోంది. దీనికి అనుబంధంగా సూరత్ నుంచి చెన్నై వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవే కారణంగా ఢిల్లీ - చెన్నై మధ్య రోడ్డు మార్గం 300 కిలోమీటర్ల మేర తగ్గనుందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో 9 ఏళ్లలో తమ మంత్రిత్వశాఖ చేపట్టిన పనులను, ఫలితాలను వెల్లడించారు.
'సూరత్ - నాసిక్ - అహ్మద్ నగర్ - సోలాపుర్ - కర్నూలు నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చి వరకు పలు రహదారులు నిర్మిస్తున్నాం. సూరత్ నుంచి సోలాపుర్ వరకు రూ.25 వేల కోట్లతో నిర్మిస్తున్న 719 కి.మీ. రహదారి నిర్మాణం 11 శాతం మేరకు పూర్తయింది. అలాగే సోలాపుర్ - కర్నూలు - చెన్నైమధ్య రూ.11 వేల కోట్లతో నిర్మిస్తున్న 340 కి.మీ రహదారి పనులు 13 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
రాయపూర్ - విశాఖపట్నం మధ్య రూ.17 వేల కోట్లతో నిర్మిస్తున్న 465 కి.మీ. రహదారి నిర్మాణం 34 శాతం పూర్తయింది. ఇండోర్ - హైదరాబాద్ మధ్య 525 కి.మీ. రహదారి నిర్మాణ పనులు 68 శాతం పూర్తయ్యాయిని, నాగ్‌పూర్ - విజయవాడ రహదారి నిర్మాణం 21 శాతం పూరి చేశామని తెలిపారు. మరోవైపు, నరేంద్ర మోడీ ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో 7 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ప్రపంచంలో అమెరికా తరవాత అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశంగా భారత్ అవతరించింది.