ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన పని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రయాణిస్తున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై ఆవుకు ఓ రొట్టె ముక్కను విసిరివేశాడు. దీన్ని చూసిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన కాన్వాయ్ ఆపించి, కారు దిగి ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి.. ఇంకోసారి అలా చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యల వల్ల మూగజీవులతో పాటు వాహనదారులకూ ప్రమాదమేనన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు.
"ఈ రోజు ఢిల్లీలో వీధుల్లో వెళుతుండగా ఓ వ్యక్తి కారులో నుంచి ఆవుకు రొట్టెముక్క విసరడం చూశా. వెంటనే కారు ఆపి ఆయన వద్దకు వెళ్లా. ఇలాంటివి ఇంకోసారి చేయొద్దని చెప్పా. రొట్టె కేవలం ఆహారం మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీక. ఇలా రద్దీగా ఉన్న రోడ్లపైకి ఆహారాన్ని విసరడం వల్ల వాటిని ఆరగించేందుకు ఆవులు, ఇతర జంతువులు అక్కడకు వస్తాయి. అపుడు మూగ జీవుల ప్రాణాలకు ప్రమాదంవాటిల్లే అవకాశం ఉంది.
వాహనదారులు రోడ్లపై నడిచే వారికీ ప్రమాదమే. అంతేకాదు, ఆహారాన్ని ఇలా అగౌరపర్చకూడదు. జంతువులకు ఆహారం పెట్టాలనుకుంటే గోశాలల వంటి ప్రాంతాలకు వెళ్ళండి. అదే మన విలువలు, బాధ్యతలను చాటిచెబుతుంది. ఢిల్లీ వాసులందరికీ నా అభ్యర్థన ఒక్కటే రోడ్లపై ఆహారాన్ని విసరొద్దు. మూగజీవులను ప్రేమించండి. మన సంస్కృతిని గౌరవించండి. రహదారి భద్రతను పాటించండి" అంటూ సీఎం రేఖా గుప్తా రాసుకొచ్చారు.