బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జనవరి 2025 (17:47 IST)

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థుల పోటీ... కేజ్రీవాల్‌పై 23 మంది పోటీ...

delhi election
ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 699 మంది అభ్యర్థులు తుది పోరులో నిలిచారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. గత 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 672 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ఇపుడు ఈ సంఖ్య 699 మందికి చేరిందని ఈసీ అధికారులు వివరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 981 మంది అభ్యర్థులు 1522 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన తర్వాత తుది బరిలో 699 మంది అభ్యర్థులు మిగిలారని చెప్పారు. 
 
ఆప్‌ అధినేత, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, భాజపా అభ్యర్థి పర్వేశ్‌ వర్మ, కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్‌ దీక్షిత్‌ పోటీ చేస్తున్న న్యూఢిల్లీలోనే అత్యధికంగా 23 మంది పోటీలో ఉన్నారు. ఆ తర్వాత జనక్‌పురిలో 16మంది, రోహ్తాస్‌ నగర్‌, కర్వాల్‌నగర్‌, లక్ష్మీనగర్‌లలో 15మంది చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇకపోతే, పటేల్‌నగర్‌, కస్తూర్బా నగర్‌లలో అత్యల్పంగా కేవలం ఐదుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా.. 38 చోట్ల 10మంది కన్నా తక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తిలక్‌నగర్‌, మంగోల్‌పురి, గ్రేటర్‌ కైలాస్‌ సీట్లలో ఆరుగురు చొప్పున, చాందినీ చౌక్‌, రాజేంద్రనగర్‌, మాలవీయనగర్‌లలో ఏడుగురు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
ఈ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్‌ మొత్తంగా అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుండగా.. భాజపా 68 చోట్ల తన అభ్యర్థుల్ని బరిలో దించింది. మిగతా రెండు సీట్లను తన మిత్రపక్షాలైన జేడీ(యూ), ఎల్జేపీలకు కేటాయించింది. మరోవైపు, బీఎస్పీ 69 చోట్ల అభ్యర్థుల్ని పోటీలో ఉంచింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 5న నిర్వహించి.. 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్న విషయం తెలిసిందే.
 
ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటే, బీజేపీ మాత్రం ఢిల్లీ పీఠంపై జెండా ఎగుర వేయాలని, ఒకపుడు తమ కంచుకోటగా ఉన్న హస్తినలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.