టీకాలు లేవుగానీ టీకాకు కాలర్ ట్యూనా? కేంద్రంపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు
కరోనా వైరస్ మహమ్మారి కష్టకాలంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కోర్టులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు దేశ ప్రజలంతా పిట్టల్లా రాలిపోతుంటే కేంద్ర వ్యవస్థ మాత్రం అచేతనంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో దేశంలో టీకా కార్యక్రమంపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిపడా టీకాలు లేవు కానీ ఫోన్‌లో కాలర్ ట్యూన్, సందేశాల ద్వారా విసిగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకా అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా మే 1 వ తేదీన దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభించింది. ఇప్పటికే దేశంలోని 17 కోట్ల మందికి టీకాలు వేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రస్తుతం దేశంలో టీకాల కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయమై స్పందిచకపోయినప్పటికీ ఢిల్లీ హైకోర్టు ఈ విషయమై గురువారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
'కాల్ చేసినప్పుడల్లా ఫోన్‌లో ఆ చిరాకు కాలర్ ట్యూన్‌తో విసిగిస్తున్నారు. ఇది ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. మీరు ప్రజలకు టీకాలు వేయాలి. కానీ మీ వద్ద సరిపడా టీకాలు లేవు. మరెందుకు తప్పకుండా టీకాలు వేసుకొండంటూ ప్రజలకు కాలర్ ట్యూన్ ద్వారా చెబుతున్నారు? మరి వాళ్లకు టీకా ఎలా అందుతుంది? వారికి టీకా ఎవరు వేస్తారు? ఆ సందేశం ఉద్దేశం ఏంటి? మీరు ప్రతి ఒక్కిరికి టీకా అందించాలి. ఇంకో పదేళ్ల ఈ సందేశం కొనసాగేలా కనిపిస్తోంది. సందేశం చెప్పడం కంటే ఎక్కువ ఏదైనా చేయాల్సి ఉంది. ఇంకేదైనా కొత్తది వింటే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ డబ్బులు తీసుకున్నా సరే, అందరికీ టీకా ఇవ్వాలి. ఈ విషయం చిన్నపిల్లలు కూడా తెలుస్తోంది' అని జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం తెలిపింది.