శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (18:46 IST)

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవిస్... ఆ చెక్కుపై తొలి సంతకం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవీస్‌.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం ఆ చెక్‌ను కుసుం వెంగుర్‌లేకర్‌కు ఆయనే స్వయంగా అందజేశారు. 
 
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ నెల 23న ప్రమాణస్వీకారం చేసిన విషయం విదితమే. ఎన్సీపీ నాయకుడు అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరాయి. ఫడ్నవీస్‌ ప్రభుత్వం బలనిరూపణ చేసుకునేందుకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఈ నెల 30 వరకు గడువు ఇచ్చారు. 
 
అయితే, మహారాష్ట్ర సర్కారు బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ నాయకులు గవర్నర్‌ కోశ్యారీని రాజ్‌భవన్‌లో కలిశారు. తమకు 162 ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు లేఖ అందజేశారు. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. 
 
ఎప్పుడుంటే ఎప్పుడు 162 ఎమ్మెల్యేల మద్దతు చూపిస్తామని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ నాయకులు స్పష్టం చేశారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 145.