సరికొత్తగా ఈ-ఆధార్ : అశోక చక్రంతో మువ్వన్నెల పతాకం
భవిష్యత్తులో అన్నింటికీ ఆధారం ఆధార్ కానుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆధార్ కార్డును మరింత సెక్యూరిటీతో రూపొందించారు. ఆధార్ కార్డుల ద్వారా వ్యక్తిగత డేటా చౌర్యం అవుతోందన్న ఆందోళనలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఆధార్ డేటా భద్రంగా ఉందా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇలాంటి సందర్భంలో మారుతున్న కాలానికనుగుణంగా మార్పులు చేస్తున్నారు. అలా ఇపుడు సరికొత్త ఆధార్ కార్డును తయారు చేశారు. ఇది చూడముచ్చటగా ఉంది. ఈ కార్డును ఎలా పొందాలో తెలుసుకుందాం.
ఈ-ఆధార్‌ను ఎలా పొందాలి?
ముందుగా మీరు ఆధార్ వెబ్‌పోర్టల్‌కు వెళ్లాలి. వెబ్ పోర్టల్ ఓపెన్ చేయగానే.. న్యూ ఈ-ఆధార్ కార్డుకు సంబంధించిన యాడ్ కూడా వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఈ యాడ్ కింద వెబ్‌సైట్‌లో గెట్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ గెట్ ఆధార్ అనే ఆప్షన్ కింద డౌన్‌లోడ్ ఆధార్ అని ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్‌ను అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేశాక.. సెండ్ ఓటీపీని క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిని ప్రెస్ చేసిన తర్వాత యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి రీ ప్రింట్ కావాలా? ఎన్ని రోజులలో కావాలి? అని అడుగుతుంది. సెలెక్ట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత రూ.50 డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి. పోస్టల్ ద్వారా నిర్ణీత సమయంలో మీ ఇంటికి కొత్త ఈ ఆధార్ కార్డు వస్తుంది. అలాగే అప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్ డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కొత్తగా.. సరికొత్తగా...
సరికొత్త ఈ-ఆధార్ కార్డు డిజైన్ విభిన్నంగా ఉంటుంది. గతంలో కాషాయం, ఆకుపచ్చ రంగుల ట్యాగ్‌లు ఉండేవి. ఇప్పుడు జాతీయ జెండాలాగానే ఉంటుంది. ఈ రెండు ట్యాగ్‌ల మధ్యలో ఆశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం ఉండటంవల్ల జాతీయ జెండాలాగా ఉంటుంది. కార్డు కూడా బోర్డర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. కార్డులో మీ వర్చువల్ ఐడీ నెంబర్ కూడా పొందుపరిచి ఉంటుంది. డిజిటల్ సైన్‌తో ఉంటుంది. ఆధార్ కార్డును జారీ చేసిన తేదీ, డౌన్‌లోడ్ చేసిన తేదీ కూడా ఉంటుంది. గతం కంటే మిన్నగా సెక్యూర్డ్ క్యూ ఆర్ కోడ్, రెసిడెంట్ ఫొటోగ్రాఫ్ కూడా ఉంటుంది. మీ ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ అయి ఉంటుంది.