ఆధార్ కార్డు వుంటే చాలు.. ఇక నేపాల్, భూటాన్ చుట్టేయవచ్చు...
దేశంలో ఆధార్ కార్డుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్లు అనుసంధానం అయిన నేపథ్యంలో.. ఆధార్ కార్డుతో నేపాల్, భూటాన్‌కు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చునని కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అన్ని వర్గాల వారికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిన తరుణంలో.. భారతీయులు నేపాల్, భూటాన్ దేశాలకు వీసా లేకుండా ఆధార్ కార్డుతో వెళ్ళొచ్చునని కేంద్రం వెల్లడించింది.
కానీ 15 వయస్సుకు లోబడిన వారు.. 65 ఏళ్లకు మించిన వారికి ఈ ఆఫర్ వుండదని.. కేంద్రం తెలిపింది. వారు భూటాన్, నేపాల్‌లో ప్రయాణించాలనుకుంటే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డులను ప్రత్యామ్నాయంగా చూపించాలని కేంద్రం ప్రకటించింది.
కాగా భారత పౌరులందరికీ వయోబేధం లేకుండా ఆధార్ కార్డులను కేంద్రం తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. ఆధార్ కార్డును అన్నింటికి కేంద్రం అనుసంధానం చేసింది. చివరికి సిమ్ కార్డులను పొందేందుకు కూడా ఆధార్ కార్డును అడగటంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఇంకా ఆధార్ కార్డు ద్వారా వ్యక్తిగత వివరాలు చోరీకి గురవుతున్నట్లు కూడా విమర్శలొచ్చాయి. ఇలాంటి తరుణంలో ఆధార్ కార్డుతో నేపాల్, భూటాన్ వంటి దేశాలకు వీసా లేకుండా పర్యటించవచ్చునని కేంద్రం ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.