హత్రాస్ మృతురాలి అంత్యక్రియల్లో వివాదం లేదు : జిల్లా మేజిస్ట్రేట్
హత్రాస్ అత్యాచార మృతురాలి అంత్యక్రియల్లో ఎలాంటి వివాదం లేదని జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అంత్యక్రియల సమయంలో మృతురాలి బంధువలంతా ఉన్నారని ఆయన తెలిపారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురైన ఓ యువతి మృతదేహానికి పోలీసులు అర్థరాత్రి 2.30 గంటలకు హడావుడిగా దహనసంస్కారాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులను ఇళ్లలో ఉంచి తాళాలు వేసి.. బయటకు రానీయకుండా చేసి మరీ బాధిత యువతి మృతదేహాన్ని పోలీసులు దహనం చేశారు.
ఢిల్లీ ఆసుపత్రి నుంచి బాధిత యువతి మృతదేహాన్ని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్‌కు మంగళవారం రాత్రి తరలించి ఈ పని చేశారు. ముఖ్యంగా, తల్లిదండ్రులకు కుమార్తెను కడసారి చూసే అవకాశం కూడా ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెల్సిందే. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ స్పందించారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో దహనసంస్కారాలు జరగలేదన్న వార్తలను ఆయన ఖండించారు. దహన సంస్కారాల సమయంలో కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నట్లు తమ వద్ద వీడియోలు ఉన్నాయని, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే అంత్యక్రియలు జరిగినట్లు ఆయన తెలిపారు.
కుటుంబ సభ్యుల్లో కొందరు దహససంస్కారాల సమయంలో అక్కడే ఉన్నారని, మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్కర్ చెప్పారు. బాధిత యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురుని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.