బుధవారం, 8 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 అక్టోబరు 2025 (09:42 IST)

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

nitin gadkari
రానున్న నాలుగు లేదా ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఫిక్కీ నిర్వహించిన హైయ్యర్ ఎడ్యుకేషన్ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, ప్రస్తుతం పెట్రోల్ వాహనాల ధరల కంటే విద్యుత్తు వాహనాల (ఈవీ) ధరలు అధికంగా ఉన్నాయని, అయితే ఈవీల తయారీ, వినియోగం అధికమవుతున్నందున వచ్చే 4-6 నెలల్లోగా ఈ రెండు రకాల వాహనాల ధరల మధ్య ధరల అంతరం గణనీయంగా తగ్గనుందన్నారు. 
 
అలాగే శిలాజ ఇంధనాలపై ఆధారపడటం మన దేశానికి ఆర్థిక భారమన్నారు. ఏటా చమురు దిగుమతులపై రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, పర్యావరణానికీ ముప్పు కలుగుతోందన్నారు. దేశ పురోగతి కోసం శుద్ధ ఇంధనాన్ని అందిపుచ్చుకోవడం కీలకమని 20వ ఫిక్కీ హైయర్ ఎడ్యుకేషన్ సదస్సులో మంత్రి తెలిపారు. రాబోయే అయిదేళ్లలో భారత వాహన పరిశ్రమను ప్రపంచంలో అగ్రస్థానానికి చేర్చడమే లక్ష్యమన్నారు. 
 
'రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి భారత వాహన పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుతం అది రూ.22 లక్షల కోట్లకు చేరింది. అమెరికా (రూ.78 లక్షల కోట్లు), చైనా (రూ.47 లక్షల కోట్లు) తర్వాతి స్థానంలో మనమే ఉన్నాం' అని గడ్కరీ వివరించారు. జొన్న నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనంగా రూ.45,000 కోట్లు సంపాదించారని తెలిపారు.