బుధవారం, 8 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 అక్టోబరు 2025 (15:19 IST)

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

rishabh shetty
హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ నిర్వహించిన రాజకీయ ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయాల పాలయ్యారు. ఈ ఘటన కన్నడ హీరో రిషబ్‌ శెట్టి స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఒక్కరి తప్పు కారణంగా ఇలాంటివి జరగవని.. సమష్టి వైఫల్యం కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.
 
'సినీ ప్రియులు హీరోలను ఆరాధిస్తారు. దేవాలయాలు కూడా కడతారు. అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు పాలాభిషేకాలు చేస్తారు. ఒక హీరో, అతడి పాత్ర నచ్చితే ఆయన్ని ఆరాధిస్తాం. ఈ ఘటనపై స్పందించడానికి మాటలు రావడం లేదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఇది ఒక్కరి వల్లే జరిగి ఉండకపోవచ్చు. సమష్టి వైఫల్యమే కారణమై ఉండొచ్చు. అందరూ ఒకేసారి రావడంతో బహుశా వాళ్లను నియంత్రించడంలో లోపం జరిగి ఉండొచ్చు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రమాదాలు జరగవు. మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం సులభం. కానీ, జనసమూహాన్ని నియంత్రించడంలోనూ చాలా ఇబ్బందులు ఉంటాయి' అని రిషబ్‌ అన్నారు.
 
వచ్చే యేడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీవీకే పార్టీ చీఫ్‌, సినీ నటుడు విజయ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 27వ తేదీన కరూర్‌లో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో తొక్కిసలాట జరగడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణ జరుగుతోంది.