శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (14:04 IST)

సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక.. మూతపడిన ఫైవ్‌స్టార్ హోటల్

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఉన్న అనేక నక్షత్ర హోటల్స్ ‌కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వ్యాపారాలు లేక మూసివేసే పరిస్థితి నెలకొంది. చిన్న చిన్న వ్యాపారాలనే కాదు.. పెద్ద పెద్ద బిజినెస్‌లనూ మహమ్మారి దెబ్బ తీసింది. 
 
మహమ్మారి వల్ల పర్యాటక రంగంపై భారీగానే దెబ్బ పడింది. హోటళ్లు, ఆతిథ్య రంగం డీలా పడిపోయింది. పర్యాటకులు రాక, అతిథులు లేక హోటళ్లు వెలవెలబోయాయి. వ్యాపారం మొత్తం క్షీణించింది. ఇపుడు తాజాగా ముంబైలోని ఓ నక్షత్ర హోటల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగులకు కనీసం వేతనాలివ్వలేని పరిస్థితికి వచ్చింది. 
 
ముంబైలోని హయత్ రీజెన్సీ అనే ఫైవ్ స్టార్ హోటల్‌ను ‘నిరవధికంగా మూసేస్తున్నాం’ అని యాజమాన్యం ప్రకటించింది. ముంబై విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఉండే హయత్ రీజెన్సీని ఏషియన్ హోటల్స్ (వెస్ట్) లిమిటెడ్ నిర్వహిస్తోంది.
 
అయితే, హోటల్ నిర్వహణకు మాతృ సంస్థ నుంచి ఇప్పటిదాకా నిధులు విడుదల కాలేదని హోటల్ జనరల్ మేనేజర్ హర్దీప్ మార్వా చెప్పారు. దీంతో ఉద్యోగులు, సిబ్బందికి కనీసం జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల హోటల్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హోటల్‌ను మూసేస్తున్నట్టు తెలిపారు.