శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (18:37 IST)

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు : కేంద్రానికి టికాయత్ వార్నింగ్

rakesh tikaiat
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఛలో ఢిల్లీ కార్యక్రం కోసం ఢిల్లీ సరిహద్దులకు వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే సహించబోమని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ టికాయత్ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'దేశంలో అనేక రైతు సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘానిది ఒక్కో సమస్య. ఆ సమస్యల పరిష్కారం నిమిత్తం ఢిల్లీ బయలుదేరిన రైతులకు ఇబ్బందులు సృష్టించొద్దు. మేం వారికి దూరంగా లేము. అవసరమైతే వారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం' అని టికాయత్ వెల్లడించారు. 
 
గతంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 2020-21లో అన్నదాతలు చేపట్టిన నిరసనలో రాకేశ్‌ కీలకపాత్ర పోషించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లతో తాజాగా ఛలో ఢిల్లీ పేరిట భారీ మార్చ్‌ తలపెట్టిన రైతులకు తన మద్దతు ఉంటుందన్నారు. 
 
అయితే పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్ద నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఆ ఉద్రిక్తతల నేపథ్యంలోనే టికాయత్ వార్నింగ్ వచ్చింది. ఇదిలావుండగా.. రైతుల సమస్యల పరిష్కారం కోసం వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని బీకేయూ జాతీయ అధ్యక్షుడు నరేశ్‌ టికాయత్ కోరారు. 
 
ఆరు నెలలకు సరిపడా రేషన్ సరకులు - డీజిల్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు.. 
 
తమ డిమాండ్ల పరిష్కరించుకునే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులకు రైతులు చేరుకున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ట్రాక్టర్లతో నగరానికి మంగళవారం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కేంద్ర నిఘా వర్గాలు ప్రభుత్వానికి అందించిన సమాచారం మేరకు.. 
 
ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచే వందల సంఖ్యలో ట్రాక్టర్లలో రైతులు బయలుదేరారని తెలిపింది. వాటిలో ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలు, డీజిల్, ఇతర సామాగ్రిని తీసుకుని బయలుదేరినట్టు పేర్కొన్నారు. కొందరు రైతులు కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్ల నెరవేరే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు. సుత్తి, రాళ్లను పగలగొట్టే పరికరాలతో సహా కావాల్సినవన్నీ మా ట్రాలీల్లో ఉన్నాయి. ఆరు నెలలకు సరిపడా రేషన్, డీజిల్‌తో మేం మా ప్రాంతాల నుంచి బయలుదేరాం" అని పేర్కొన్నారు. 
 
కాగా, గత 2020-21లో ఉద్యమించిన పలువురు రైతులు కూడా ప్రస్తుత ఆందోళనలో పాల్గొంటున్నారు. అప్పట్లో వారు కొన్ని నెలల పాటు ఢిల్లీలో రక్తం గడ్డకట్టే చలిని కూడా లెక్క చేయకుండా నిరసన చేపట్టారు. ఈ రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కానీ, కేంద్ర ప్రభుత్రం మాత్రం డిమాండ్లను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఇపుడు మరోమారు వారు ఆందోళనకు దిగారు.