శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2023 (11:11 IST)

లింగమార్పిడితో పురుషుడిలా మారిన ఉపాధ్యాయురాలు

woman teacher
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు పురుషుడిగా మారిపోయింది. లింగమార్పిడి చికిత్సతో ఆమె పురుషుడిగా మారిపోయింది. దీనికి సంబంధించి ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా పొందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని షాజహన్‌పురా జిల్లా ఖుదాగంజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని నవాదా గ్రామానికి చెందిన సరితాసింగ్‌.. భారత స్వాతంత్య్ర పోరాటంలో అమరుడైన ఠాకూర్‌ రోషన్‌ సింగ్‌ మునిమనవరాలు. దివ్యాంగురాలైన ఆమెకు చిన్నప్పటి నుంచి పురుషుల దుస్తులు ధరించడం, వారిలా హెయిర్‌స్టైల్‌ చేసుకోవడం అంటే అమితమైన ఇష్టం. 
 
2020లో సరితకు ప్రాథమిక విద్యా మండలిలో స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం వచ్చింది. అదే ఏడాది లింగమార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకొని.. లక్నోలో హార్మోన్‌ మార్పిడి థెరపీ చేయించుకున్నారు. దాంతో గొంతు మారడం, ముఖంపై గడ్డం రావడం వంటి మార్పులు కనిపించాయి. తాజాగా 3 నెలల కిందట మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పూర్తిగా శరత్‌ సింగ్‌గా మారారు. 
 
షాజహాన్‌పుర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ ఉమేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ నుంచి లింగమార్పిడి ధ్రువీకరణ పత్రం కూడా అందుకున్నారు. దివ్యాంగురాలు కావడంతో సరిత ఎక్కువ సమయం చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆమె అవసరాలన్నీ సవితా సింగ్‌ అనే యువతి చూసుకునేది. చదువులో కూడా అండగా ఉండేది. ఈ నేపథ్యంలో సవితను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ప్రస్తుతం శరత్‌ సింగ్‌ నిర్ణయించుకున్నారు. ఆమె కూడా అందుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.