శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (07:43 IST)

బీహార్‌ను ముంచెత్తిన వరదలు

బీహార్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా ఇంతవరకూ 17 మంది మృతి చెందారు.

ఆదివారంనాడు వేర్వేరు ప్రాంతాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. భగల్‌పూర్ జిల్లాలో గోడ కూలి ముగ్గురు మరణించగా, ఆటోపై చెట్టుపడి ఖగౌల్‌లో నలుగురు మృతి చెందారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాట్నాలోని రోడ్లు, ఆసుపత్రి ఆవరణలు నీట మునిగాయి.

నలందా మెడికల్ కాలేజీ ఆసుపత్రి, గార్డనిబాగ్ ఆసుపత్రి జలదిగ్బంధంలో ఉన్నాయి. వార్డులు, ఐసీయూల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరడంతో రోగులు, సిబ్బంది ఇక్కట్ల పాలవుతున్నారు. విద్యుత్ సరఫరాకు రెండ్రోజులుగా అంతరాయం ఏర్పడింది.
 
వరద నీటిలో ఉప ముఖ్యమంత్రి నివాసం
ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే, రోడ్ల నిర్మాణ శాఖ మంత్రి నంద్ కిషోర్ యాదవ్, బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ, ఇతర రాజకీయ నాయకుల నివాసాలు కూడా నీట మునిగాయి.

నటుడు మనోజ్ బాజ్‌పేయి తన స్వరాష్ట్రంలో జల విలయంపై ట్విట్టర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, ప్రకృతి వైపరీత్యాల స్పందన బృందం (ఎన్‌డీఆర్‌ఎఫ్) కూడా రంగంలోకి దిగింది. మంగళవారం వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.