శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (11:20 IST)

దేశంలో కరోనా ప్రకంపనలు - ఒకే రోజు 90 వేల కేసులు

దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకేరోజు ఏకంగా 90 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 90,633 మందికి కరోనా సోకిందని తెలిపింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 41 లక్షలు దాటింది. ఒక్కరోజులో నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు ఇవే. అదేసమయంలో 1,065 మంది మృతి చెందారు.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 41,13,812కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 70,626 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 31,80,866  మంది కోలుకున్నారు. 8,62,320  మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో శనివారం వరకు మొత్తం 4,88,31,145 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,92,654 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. భారత్‌లో రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.73 శాతం ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
 
ఇదిలావుండగా, తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,574 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,927 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,969కి చేరింది.  ఇప్పటివరకు మొత్తం 1,07,530  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 886కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 325 కరోనా కేసులు నమోదయ్యాయి.