ఆలయ ఉత్సవాల్లో అపశృతి - కూలిన క్రేన్.. నలుగురి మృతి
తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లాలో ఆదివారం రాత్రి ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయ వేడుకల్లో జరిగిన ఈ అపశృతిలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆలయ విగ్రహాలకు భారీ పూలమాలలను వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు చనిపోయారు. మరో కొందరు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాణిపేట జిల్లాలోని ద్రౌపది అమ్మన్ ఆలయంలో ప్రతి యేటా వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందులోభాగంగా, ఆదివారం రాత్రి ఆలయ ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరిగింది. ఈ విగ్రహాలకు భారీ క్రేన్‌పై ఉంచి పూజారులు, ఆలయ సిబ్బందితో పాటు మొత్తం ఎనిమిది మంది క్రేన్‌పైకెక్కారు. వీరు ఉత్సవ మూర్తులకు పూలమాలలు వేస్తుండగా, ఒక్కసారిగా క్రేన్ కూలిపోయింది.
క్రేన్ బాగా ఎత్తుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని రాణిపేట జిల్లా ఎస్పీ దీపా సత్యన్ వెల్లడించారు. నిజానికి ఆలయ వేడుకల్లో క్రేన్‌ను ఉపయోగించేందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని అందుకే క్రేన్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై ప్రాథమిక విచారణ జరుపుతున్నట్టు ఎస్పీ చెప్పారు.