శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:03 IST)

సీబీఐ మాజీ తాత్కాలిక బాస్‌కు సుప్రీంకోర్టు వింతశిక్ష.. ఏంటది?

దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్, తెలుగు ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వర రావుకు సుప్రీంకోర్టు వింత శిక్షను విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు రూ.లక్ష ఫైన్ చెల్లించాలనీ లేనిపక్షంలో ఒక రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోవాలంటూ ఆదేశించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేయొద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. కానీ, సీబీఐ మాజీ తాత్కాలిక బాస్‌గా ఉన్న ఎం.నాగేశ్వర రావు ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఈ కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేశారు. 
 
ఈ చర్యపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎం.నాగేశ్వర రావు భేషరతు క్షమాపణలు చెప్పారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను బదిలీ చేయడం తన తప్పేనని నాగేశ్వర్ రావు సోమవారం కోర్టు ముందు అంగీకరించారు. క్షమాపణ కూడా అడిగారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించే ఉద్దేశం తనకు లేదని అన్నారు.
 
అయితే, ఈ క్షమాపణలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అదేసమయంలో ఓ వింత శిక్ష విధించింది. రోజంతా కోర్టులో ఓ మూలన కూర్చోవాలని, రూ.లక్ష జరిమానా కట్టాలని ఆదేశించడం విశేషం. 'నాకు నచ్చింది చేస్తా అన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇది సహించరానిది. ఈ పని చేసే ముందు కోర్టు అనుమతి అడిగి ఉంటే మిన్ను విరిగి మీద పడేదా? ఇది కోర్టు ధిక్కరణ కాకపోతే మరేంటి' అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఈ ధిక్కరణకుగాను రూ.లక్ష జరిమానా విధిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు కోర్టు ముగిసే వరకు ఓ మూలన కూర్చోవాలని ఆదేశిస్తున్నాం' అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ స్పష్టం చేశారు.