గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (17:57 IST)

కుళంభేశ్వరర్‌ ఆలయంలో బయల్పడిన స్వర్ణనిధి.. వస్త్రంతో చుట్టిన మూటలో..?

కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూరులోని ప్రాచీన కుళంభేశ్వరర్‌ ఆలయంలో నిధులు బయల్పడుతున్నాయి. రెండు రోజులకు ముందు కూడా ఆ ఆలయం వద్ద తవ్వకాలు జరిపినప్పుడు వందసవర్లకు పైగా ఆభరణాలు లభించాయని, వాటిని ఆలయనిర్వహకులు, స్థానిక ప్రజలు గుట్టుచప్పుడు కాకుండా పంచుకున్నారని తెలుస్తోంది. దీంతో దాచిన ప్రాచీన నగలను ప్రభుత్వానికి అప్పగించాలంటూ జిల్లా కలెక్టర్‌ మహేశ్వరి ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలకు ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా కుళంభేశ్వరర్ ఆలయంలో జీర్ణోద్ధరణ పనుల సమయంలో జరిపిన తవ్వకాల్లో స్వర్ణనిధి బయల్పడింది. ఈ ఆలయాన్ని రెండో కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు. ఆ ఆలయం శిథిలం కావడంతో జీర్ణోద్ధరణ పనులు చేపట్టి కుంభాభిషేకం నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఆ మేరకు సంబంధిత అధికారుల అనుమతి లేకుండానే స్థానికులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు కలిసి జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించారు. ప్రొక్లెయినర్‌తో గర్భాలయం ముందున్న శిథిలమైన మెట్లను తొలగించే పనులు శనివారం సాయంత్రం జరిగాయి. మెట్లను పెకలించి గోతిని తవ్వుతుండగా వస్త్రంతో చుట్టిన ఓ మూట కనిపించింది.
 
వెంటనే ఆలయ నిర్వాహకులు ఆ మూటను విప్పిచూడగా అందులో బంగారు కాసులు, ఆభరణాలు లభించాయి. సుమారు ఐదు వందల గ్రాముల బరువున్న ఆ స్వర్ణకాసులు, ఆభరణాలు ప్రాచీన కాలం నాటివని గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పోలీసుతో వెళ్ళి ఆ నిధి స్వాధీనం చేసుకుని వాటి విలువను కనుగొన్నారు. ఆ తర్వాత ఆలయంలో లభించిన నిధిని ప్రభుత్వపరం చేయడానికి స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీవో, తదితర ఉన్నతాధికారులు గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులతో చర్చలు జరిపిన మీదట ఆ నిధి స్వాధీనం చేసుకున్నారు.