బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (15:57 IST)

గల్వాన్‌‌ కోసం చైనా పాకులాట.. గులామ్ రసూల్ గల్వాన్ సంగతేంటి?

Ghulam Rasool Galwan
గులామ్ రసూల్ గల్వాన్ ఈయన ఎవరు.. గల్వాన్ కోసం చైనా పాకులాటపై ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. గల్వాన్ ప్రాంతంపై భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశంపై లడఖ్‌కు చెందిన గులామ్ రసూల్ గల్వాన్ మనవడు మహ్మద్ అమిన్ గల్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్‌దేనని స్పష్టం చేశారు. 
 
అంతేకాకుండా గల్వాన్ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా వివరించారు. 1878లో లేహ్‌లో జన్మించిన తన తాతయ్య గులాం రసూల్ గల్వాన్ అప్పట్లో టిబెట్, మధ్య ఆసియా కొండల్లోని కారకోరం కనుమల్లో బ్రిటిష్ పాలకులకు గైడ్‌గా పనిచేసేవారని గుర్తు చేశారు.
 
తన తాతకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఒకసారి లార్డ్ డన్మోర్ బృందం ఈ ప్రాంతానికి విహారయాత్రకు వచ్చిందని, అయితే, ఆక్సాయిచిన్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా డన్మోర్ బృందం దారి తప్పిందన్నారు. వారికి దారి చూపించే క్రమంలో తన తాతయ్య నది ఒడ్డుకు చేరుకుని వేరే మార్గం ద్వారా వారిని తప్పించి కాపాడారని పేర్కొన్నారు. మరణం అంచుల వరకు వెళ్లిన వారిని కాపాడినందుకు గుర్తుగా డన్మోర్ ఈ ప్రాంతానికి గల్వాన్‌‌ పేరు పెట్టారని రసూల్ గల్వాన్ వివరించారు.
 
19వ శతాబ్దం మధ్యలో రష్యా ఒకసారి టిబెట్‌లో విస్తరణ పనులు చేపట్టిందని, అప్పుడు తన తాత బ్రిటిష్ విస్తరణ బృందానికి గైడ్‌గా ఉన్నట్టు చెప్పారు. రష్యా కదలికలపై అంచనా వేసి బ్రిటిష్ బృందానికి ఆయన సరైన దారిచూపడంతో రష్యా ఆటలు సాగలేదని గుర్తు చేసుకున్నారు. 
 
ఆ తర్వాత 1962 ప్రాంతంలో చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసిందన్నారు. ఈ ప్రాంతం ఎప్పటికీ భారత్‌దేనని ఆయన తేల్చి చెప్పారు. అప్పుడు, ఇప్పుడు చైనీయులు అలానే చేస్తున్నారని, మన సైనికుల త్యాగాలకు జోహార్లు అని రసూల్ పేర్కొన్నారు. చైనా బుద్ధి మారలేదని మండిపడ్డారు.