ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 19 జూన్ 2020 (20:01 IST)

కోవిడ్-19 బారినపడి చనిపోయిన వారి అంతిమ సంస్కారాల మార్గదర్శకాలు

కోవిడ్-19 బారినపడి చనిపోయిన వారి మృతదేహాలను వారి సొంత ఊర్లకు, ఇళ్లకు తరలించడానికి స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికీ కరోనా బారినపడి చనిపోయినవారిని వారి స్వగ్రామాలకు తీసుకెళ్లడానికి గ్రామస్తులు అంగీకరించడం లేదు.

ఈ నేపథ్యంలో కరోనా సోకి మృతిచెందిన వారి దేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై  కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. భౌతికకాయం తరలింపు సమయంలో ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బంది, కుటుంబ సభ్యులు ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా ఎలాంటి విధివిధానాలు పాటించాలన్న సూచనలు చేసింది.  
 
మృతదేహాన్ని తరలించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- కోవిడ్-19 బారినపడి చనిపోయిన వారి భౌతికకాయాన్ని తరలించే సిబ్బంది సర్జికల్‌ మాస్క్‌, పీపీఈ  కిట్లు ధరించడం, ఎన్‌95 మాస్క్‌లు, కళ్లద్దాలు, చేతులకు గ్లోవ్స్‌ వేసుకోవడంతోపాటు ఇతర జాగ్రత్తలన్నీ పాటించాలి.
 
- మృతదేహాన్ని ప్యాక్ చేసిన బ్యాగ్, ఇతర సాధనాలు, పరికరాలతోపాటు వాహనాన్నికూడా 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి.
 
- మృతదేహాన్ని తరలించేప్పుడు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తరచుగా 1% హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి.
 
- మరణించిన వ్యక్తి ఉన్న గది, మార్చురీ, అంబులెన్స్‌, శ్మశానవాటికల్లో మృతదేహాలను ఎత్తి, దించే కార్మికులు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  
 
- మృతదేహాలను 4 డిగ్రీల సెల్సియస్‌ కోల్డ్‌ ఛాంబర్స్‌లో ఉంచాలి.
 
- అనంతరం ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా క్రిమిసంహారక ద్రావణాలతో శుభ్రం చేయాలి. 
 
అంత్యక్రియల సందర్భంగా...
- కోవిడ్‌-19 మృతదేహాల వల్ల అదనపు ముప్పేమీ రాదని కాటికాపరులకు చెప్పాలి. అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు అన్ని జాగ్రత్తలు అన్నీ పాటించేలా చూడాలి.
 
- మృతదేహాన్ని చివరిసారి చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులకు దూరం నుంచి చూడడానికి అనుమతించవచ్చు. 
 
- భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులను అనుమతించకూడదు. కేవలం దగ్గరి బంధువులు, ముఖ్యమైన వారినే అనుమతించాలి.
 
- భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ ముట్టుకోకుండా వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలన్నీ కొనసాగించవచ్చు.
 
ఏదైనా స్క్రిప్ట్ చదవడం, పవిత్ర జలం చల్లడం లాంటి మతపరమైన క్రతువులను భౌతికాయం దగ్గర కాకుండా దూరం నుంచి చేసుకోవాలి.
 
- మృతదేహానికి చివరి సారిగా స్నానం చేయించడం, తాకడం, ముద్దు పెట్టడం, కౌగిలించుకునేందుకు ప్రయత్నించడం లాంటివి చేయకూడదు.
 
- మృతదేహం దహనం/ఖననం తర్వాత కాటికాపరులు, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.  
 
- మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత వచ్చే బూడిద నుంచి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రావు. వారి కుటుంబ ఆచారం ప్రకారం అంతిమ క్రతువు కోసం బూడిదను సేకరించవచ్చు.
 
- చనిపోయిన వారి సమీప కుటుంబ సభ్యుల నుంచి మిగతావారు సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్తపడాలి.