గుజరాత్‌లో ముగిసిన రెండో దశ ఓటింగ్ : పోలింగ్ ఎంత శాతమంటే..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, సోమవారం రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే, సాయంత్రం 5.30 గంటలకు మొత్తం 59 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండో దశలో భాగంగా 14 జిల్లాల్లో 93 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు.
కాగా, గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉండగా, డిసెంబరు ఒకటో తేదీన 89 స్థానాలకు ఓటింగ్ జరిగింది. రెండో దశలో మిగిలిన స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ రెండు దశల ఓట్ల లెక్కింపు ఈ నెల 8వ తేదీన చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు.
కాగా, ఈ రెండో దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర టేల్, పాటిదార్ ఉద్యమకారుడు హార్ధిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవానీ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.