శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2022 (15:57 IST)

బిలాస్‌పూర్ - నాగ్‌పూర్‌ల మధ్య వందే భారత్ సేవలు..

Bharat Express
దేశంలో మరో వందే భారత్ రైలు (సెమీ హైస్పీడ్ రైలు) ఈ నెల 11వ తేదీ నుంచి పట్టాలెక్కనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ల మధ్య ఈ రైలును నడుపనున్నారు. 
 
వారంలో ఆరు రోజుల పాటు తిరిగేలా ఈ సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలు సర్వీసును పట్టాలెక్కించనున్నట్టు భారతీయ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య గమ్యాన్ని ఈ రైలు కేవలం ఐదున్నర గంటల లోపే చేరుకుంటుంది. పైగా, ఇది రాయపూర్, దుర్గ్, గోండియా రైల్వే స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుందని తెలిపారు. 
 
ఇదిలావుంటే, సికింద్రాబాద్ - విజయవాడల మధ్య కూడా మరో వందే భారత్ రైలును నడుపనున్నారు. ఇది వచ్చే యేడాది నుంచి పట్టాలెక్కనుంది. ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ సమాచార వ్యవస్థ, వైఫై, సౌకర్యవంతమైన సీట్లతో వచ్చేయేడాది ఆగస్టులోగా 75వ వందే భారత్ రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.