శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2022 (08:26 IST)

రేపు పీఎం కిసాన్ నిధులు పంపిణీ - 12వ విడతలో రూ.16 వేల కోట్లు

pm kissan
పీఎం కిసాన్ పథకం కింద సోమవారం నిధులు పంపిణీ చేయనున్నారు. 12వ దశలో మొత్తం 16 వేల కోట్ల రూపాయలను పంపిణీ చేస్తారు. అలాగే, దేశంలో ఉన్న 2.7 లక్షల ఎరువుల చిల్లర దుకాణాలను దశలవారీగా వన్‌స్టాప్‌ సెంటర్లుగా మార్చి వాటికి ‘పీఎం సమృద్ధి కేంద్రాలు’గా నామకరణం చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. 
 
రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, భూసార పరీక్ష సౌకర్యాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని వీటిల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
అదేవిధంగా ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అగ్రి స్టార్టప్‌ సదస్సు/ ఎగ్జిబిషన్‌ను, 600 ‘పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాల’ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు 300 అంకుర పరిశ్రమలు తమ నవకల్పనలను ప్రదర్శిస్తాయన్నారు. రైతులకు ‘పీఎం సమ్మాన్‌ నిధి’ 12వ విడత కింద రూ.16 వేల కోట్లను ప్రధాని విడుదల చేయనున్నారనీ, ఇప్పటివరకు రూ.2.16 లక్షల కోట్లు విడుదల చేసినట్లవుతుందని ఆయన వివరించారు. 
 
‘ఒకే దేశం ఒకే ఎరువు’ ఇతివృత్తంతో భారత్‌ యూరియా, భారత్‌ డీఏపీ, భారత్‌ ఎంఓపీ, భారత్‌ ఎన్‌పీకే బస్తాలను ప్రధాని మోడీ విడుదల చేస్తారన్నారు. వీటన్నింటినీ భారత్‌ పేరుతో విడుదల చేయడంవల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు.