1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 జులై 2021 (19:40 IST)

సాయుధ బలగాల సిబ్బంది సెలవులపై నివేదిక కోరిన హోంశాఖ

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సాయుధ బలగాల సిబ్బందికి ఏడాదికి 100 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన అమలుపై హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరింది.

తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సమస్యాత్మక భూభాగాల్లో విధులు నిర్వహించే సాయుధ సిబ్బందికి తగిన విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో ఏడాదికి 100 రోజుల సెలవులు మంజూరు చేయాలని 2019 అక్టోబరులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపాదించారు.

దీనిని అమలు చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన ఎంత వరకు వచ్చిందో తెలపాలని ఆయా విభాగాలను హోంశాఖ తాజాగా ఆదేశించింది.

దాదాపు 10 లక్షల సిబ్బందితో కూడిన కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల(సీఏపీఎఫ్‌) పరిధిలోకి సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌ వస్తాయి. వీటిలో రెండు విభాగాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ఇప్పటికి సిద్ధమైనట్లు సమాచారం.