బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

పోలీసు కస్టడీకి హనీప్రీత్ .. నిర్దోషినంటూ కోర్టులో బోరున విలపించిన దత్తపుత్రిక

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌కు కోర్టు ఆరు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా హనీప్రీత్‌ కోర్టులో కంట తడిపెట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని..

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌కు కోర్టు ఆరు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా హనీప్రీత్‌ కోర్టులో కంట తడిపెట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని... నిర్దోషినని చేతులు జోడించి కోర్టును వేడుకున్నారు. గుర్మీత్‌కు కోర్టు శిక్ష విధించిన తర్వాత హింసను ప్రేరేపించారన్న ఆరోపణలతోపాటు.. దేశ ద్రోహం కేసులను హనీప్రీత్‌పై నమోదైవున్న విషయం తెల్సిందే. 
 
అత్యాచారం కేసులో డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారించిన తర్వాత హనీప్రీత్ 38 రోజులుగా కనిపించకుండా పోయారు. ఆమెకోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పంజాబ్ పోలీసులు హనీప్రీత్‌ను మంగళవారం పంజాబ్‌లోని జిరక్‌పూర్‌ - పటియాలా రోడ్డులో హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అరెస్ట్‌ చేసిన అనంతరం పంచకులలోని చండీమందిర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సుమారు 5 గంటలపాటు పోలీసులు ఆమెను విచారించారు. 
 
ఆ తర్వాత హనీప్రీత్‌ను హర్యానా పోలీసులు పంచకుల కోర్టులో ప్రవేశపెట్టారు. భారీ భద్రత నడుమ హనీప్రీత్‌ను కోర్టుకు తీసుకెళ్లారు. హనీప్రీత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించాలని పోలీసులు కోర్టును కోరగా.... 6 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం పంచకులలో అల్లర్లు జరిగిన సమయంలో హనీప్రీత్ వాడిన మొబైల్‌ ఫోను కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. హనీప్రీత్‌ కోర్టులో కంట తడి పెట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.... నిర్దోషినని కోర్టును వేడుకున్నారు. 
 
కాగా, ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో ఆగస్టు 25న గుర్మీత్‌కు పంచకుల సిబిఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు శిక్ష  ప్రకటించగానే పంచకులలో హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనల్లో 31 మంది మరణించగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది. హింసాత్మక ఘటనల వెనక హనీప్రీత్‌, డేరా అనుచరుల హస్తం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు.