1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జులై 2016 (14:14 IST)

పంజాబ్ నుంచే తరిమేయాలని చూశారు.. మాతృభూమి కంటే పార్టీ గొప్పది కాదు : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

తనను ఏకంగా పంజాబ్ రాష్ట్రం నుంచే తరిమికొట్టాలని చూశారనీ, అందుకే భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. తనకు మాతృభూమి కంటే పార్టీ పదవులు గొప్పవి కావని తేల్చి చెప్పారు. 
 
ఇటీవల ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దీనికి ఆయన సోమవారం వివరణ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్రానికి దూరంగా ఉండాలని తనను కోరడంతోనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. 'దేశభక్తి గల పక్షి కూడా తన చెట్టును వదిలిపోదు. నా మూలాలు పంజాబ్‌లోనే ఉన్నాయి. నేను అమృత్‌సర్‌ను వదలి ఎలా వెళ్లగలను? అసలు ఎందుకు వదిలి వెళ్లాలి? నా తప్పేంటి?' అని సిద్ధూ ప్రశ్నించారు. 
 
పంజాబ్ ప్రయోజనాల పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని, దానికి ఎవరైతే కట్టుబడతారో తాను అక్కడకు వెళ్తానని చెప్పుకొచ్చారు. పంజాబ్‌ కోసం తాను ఎలాంటి కష్టనష్టాలకైనా భరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. గత ఎన్నికల్లో కురుక్షేత్ర లేదా ఢిల్లీ దక్షిణం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కోరారన్నారు. మరి గతంలో ఎంపీగా గెలిపించిన పంజాబ్ ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 
 
అందుకే తాను పార్టీ పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ మాతృభూమిని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సిద్ధూ చేరవచ్చని, ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ఆయనను బరిలోకి దింపే అవకాశాలున్నాయని కొద్దిరోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలపై సిద్ధూ స్పందించలేదు.