1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (17:21 IST)

హెలికాఫ్టర్ ప్రమాదానికి కారణాలేంటి?

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరు కొండ అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇదే హెలికాఫ్టర్‌లో ప్రయాణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. కానీ, ఆయన పరిస్థితుపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ, ఈ ప్రమాదంలో ఆయన భార్య మధులిక రావత్ చనిపోయినట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుంటే, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై వాడివేడిగా చర్చ సాగుతోంది. విమానం చెట్లను ఢీకొట్టి మంటలు వ్యాపించడాన్ని తాను చూశానని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చారు. పైగా, ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ కూడా పూర్తిగా కాలిపోయింది. 
 
అయితే, ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కారణమా? లేక హెలికాఫ్టర్ కరెంట్ తీగలను తాకిందా లేక మెకానికల్ లోటుపాట్లు తలెత్తాయి? ఇంజన్ వైఫల్యమా? సాంకేతిక లోపం తలెత్తిందా? పైలెట్ తప్పిదం ఉందా? హెలికాఫ్టర్‌ను పైలెట్ నియంత్రించలేక పోయారా? హెలికాప్టర్ ప్రమాదానికి గురికాకముందు ఎంత ఎత్తులో వెళుతున్నది వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
అయితే, ఈ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని భారత ఎయిర్ చీఫ్ వీఆర్ చౌదరితో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌‍నాథ్ సింగ్ సందర్శించనున్నారు. ఆ తర్వాత ఈ ప్రమాదంపై పూర్తి వివరాలతో రక్షణ శాఖ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.