1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (11:22 IST)

అర్థరాత్రి విందు కోసం హోటల్ సిబ్బందిపై దాడి... యువ ఐఏఎస్ - ఐపీఎస్‌లపై వేటు

rajasthan officers
కొత్త పోస్టింగులో చేరిన ఒక ఐఏఎస్, మరో ఐపీఎస్ యువ అధికారులపై వేటుపడింది. విందు పార్టీ అర్థరాత్రి హోటల్‌కు వెళ్లి సిబ్బందితో గొడవపడి, దాడి చేసినందుకు వారిద్దరిపై ప్రభుత్వం వేటువేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్య తీసుకుంది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి గిరిధర్‌ అజ్మీర్ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా ఉన్నారు. గంగాపుర్‌ సిటీ పోలీసు విభాగానికి ఐపీఎస్‌ అధికారి సుశీల్‌ కుమార్‌ బిష్ణోయ్‌ ఓఎస్‌డీగా నియమితులయ్యారు. వీరిద్దరూ యువ అధికారులే. ఈ కొత్త నియామకాన్ని పురస్కరించుకొని విందు చేసుకునేందుకు అర్థరాత్రి తమ స్నేహితులతో కలిసి హోటల్ రెస్టారెంటుకు వెళ్లారు. అర్థరాత్రి సిబ్బంది గాఢ నిద్రలో ఉండగా, వారిని నిద్రలేని వంట చేయాలంటా హుకుం జారీచేశారు. దానికి వారు సమ్మతించకపోవడంతో వాళ్లతో గొడవపడ్డారు. 
 
దీనిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ, 'ఆదివారం అర్థరాత్రి దాటాక ఆ ఇద్దరు అధికారులు స్నేహితులతో కలిసి వచ్చారు. సిబ్బందిని నిద్ర లేపి గొడవకు దిగారు. నాకు సమాచారం అందగానే.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. నా ఫిర్యాదు అందుకున్న పోలీసులు అదే ఐపీఎస్‌ అధికారితో కలిసివచ్చి కర్రలు, ఇనుప రాడ్లతో మావాళ్లపై దాడి చేశారు. 11 మంది గాయపడ్డారు' అని తెలిపారు. ఈ ఘటనపై సీరియస్ అయిన రాజస్థాన్ సర్కారు వారిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఇద్దరు అధికారులకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులపై కూడా వేటు వేసింది.