బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (15:00 IST)

రాహుల్ పేరున్నంత మాత్రాన పోటీ చేయకుండా నిషేధం విధించలేం: సుప్రీంకోర్టు

supreme court
రాహుల్ లేదా రాహుల్ గాంధీ పేరున్నంత మాత్రం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై  సుప్రంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. రాజకీయ నేతల పేర్లతో ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా పోటీ చేయకుండా తాము ఆపలేమని స్పష్టం చేసింది.
 
ఒక నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు/డూప్లికేట్‌ అభ్యర్థులను అనుమతించకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సాబు స్టీఫెన్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కీలక స్థానాల్లో ఓటర్లను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే కొందరు ఇలా చేస్తున్నారని, ప్రత్యర్థుల అవకాశాలను దెబ్బకొట్టేందుకు ఒకే పేరుతో ఉన్న స్వతంత్రులను బరిలోకి దించుతున్నారని పిటిషన్‌ ఆరోపించారు.
 
ఈ పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం దీన్ని విచారించేందుకు తిరస్కరించింది. 'ఈ కేసు ఎలాంటిదో మీకు తెలుసా? తల్లిదండ్రులే ఆ పేర్లను పెట్టినప్పుడు.. ఎన్నికల్లో పోటీకి అదెలా అడ్డంకి అవుతుంది? ఒకవేళ ఎవరైనా రాహుల్‌ గాంధీ, లాలూప్రసాద్‌ యాదవ్‌ వంటి పేర్లను పెట్టుకుంటే వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా ఆపగలం? అది వాళ్ల హక్కులను ఉల్లంఘించినట్లు కాదా?' అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అభ్యర్థనను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌ను అనుమతించింది.