శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2022 (18:14 IST)

మణిపూర్‌లో ఉద్రిక్తిత - ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో వచ్చే ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. శనివారం రాత్రి బిష్ణోపూర్‌లోని ఫౌగాక్చావో ఇఖాంగ్ వద్ద కొందరు దండగులు ఓ వాహనానికి నిప్పుపెట్టారు. 
 
ఈ ఘటనతో స్థానికంగా ఉండే రెండు సామాజిక వర్గాల ప్రజల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో సంఘ వ్యతిరేక శక్తులు సామాజిక మధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తుండటంతో పోలీసులు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.
 
గత కొన్నాళ్లుగా ఈ రాష్ట్రంలో ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏటీఎస్‌యూ) పిలుపు మేరకు ఆందోళనలు, బంద్‌లు, హైవే రాకపోకలను అడ్డుకోవడాలు జరుగుతున్నాయి. ఏటీఎస్‌యూ ఆ రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన ఈ విద్యార్థి సంఘం. 
 
ది మణిపూర్‌ (హిల్‌ ఏరియాస్‌)అటానమస్‌ డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్‌ బిల్‌ను ఆమోదించాలని ఏటీఎస్‌యూ డిమాండ్‌ చేస్తోంది. ఈ బిల్లును 2021లో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే ఆదివాసీ ప్రాంతాలకు పలు హక్కులు, అధికారాలు సంక్రమిస్తాయి. 
 
గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి బిల్లు ఒక దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ, ఆ బిల్లు విద్యార్థి సంఘం డిమాండ్లకు అనుకూలంగా లేదు. పైగా అసెంబ్లీ అజెండాలో కూడా లేదు. దీంతో ఆందోళనలు చోటుచేసుకొన్నాయి. ఈ సందర్బంగా జరిగిన ఘర్షణల్లో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఐదుగురు ఆదివాసీ విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి జైళ్లకు తరలించారు.
 
ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకులను విడిచిపెట్టాలని (ఏటీఎస్‌యూఎం) నాయకులు ఆందోళన చేపట్టారు. హైవేలను పూర్తిగా దిగ్బంధించారు. ఈ క్రమంలో వాహనాలకు నిప్పుపెట్టారు. మణిపూర్‌లో పర్వత ప్రాంతాలు, లోయల్లో నివసించేవారి మధ్య తారతమ్యాలు ఎక్కువగా ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉండగా.. లోయల్లో మెయితేయి వర్గం అధికంగా ఉంది. లోయ ప్రాంతాల వారికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందన్నది పర్వత ప్రాంతాల్లోని ఆదివాసుల ఆరోపణ.