శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (11:19 IST)

ఎన్నికల ఎఫెక్ట్ :: పెట్రోల్ - డీజల్ ధరల తగ్గింపునకు కసరత్తు!

petrol
త్వరలోనే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి రాష్ట్రాలు ఉన్నాయి. అయితే, ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చేయేడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణిస్తారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపొంది సత్తా చాటాలని అధికార బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచి ఎత్తులు పైఎత్తులు వేస్తూ, సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 మేరకు తగ్గించారు. ఇపుడు పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించే విషయంపై కసరత్తు చేస్తున్నారు. 
 
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వంట గ్యాస్ ధరను తగ్గించిన కేంద్రం.. ఇంధన ధరలు కూడా తగ్గించేందుకు సిద్ధమవుతుందని ప్రముఖ ఆర్థికసంస్థ సిటీ గ్రూప్ ఓ కథనాన్ని వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. వంట గ్యాస్ ధర తగ్గింపు నిర్ణయంతో ద్రవ్యోల్బణం దాదాపు 30 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక వేత్తలు సమీరన్ చక్రవర్తి, బకార్ ఎం, జైదీ తెలిపారు. 
 
దీనికితోడు ఇటీవల టమాటాల ధరలు కూడా తగ్గిన నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి ద్రవ్యోల్బణం 6 శాతానికి దిగివచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నిత్యావసర ధరలు తగ్గించేందుకు కేంద్రం అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే గ్యాస్ ధర తగ్గించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనికితోడు ఇంధన ధరలు కూడా తగ్గితే ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.