మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 జూన్ 2024 (11:11 IST)

నితీశ్ కుమార్‌కు ప్రధాని పదవి ఆఫర్.. తిరస్కరించిన బీహార్ సీఎం!

nitish kumar
కేంద్రంలో పదేళ్ల తర్వాత సంకీర్ణ సర్కారు కొలువుదీరనుంది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఇతర పార్టీ భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఈ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయు అత్యంత కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీల మద్దతుతోనే బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న జేడీయు నేత నితీశ్ కుమార్‌కు బంపర్ ఆఫర్ ఒకటి వరించింది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఆయనకు ఏకంగా దేశ ప్రధాని పదవిని ఆఫర్ చేయగా, ఆయన తిరస్కరించినట్టు సమాచారం. ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
నితీశ్ కుమార్‌కు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని, కానీ, ఆయన మాత్రం తిరస్కరించారని తెలిపారు. ఈ విషయమై ఇండియా కూటమి నేతలు, తమ అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ, ప్రస్తుతం తాము ఎన్డీయే కూటమిలో ఉన్నామని స్పష్టం చేశారు. ఇపుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదన్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. త్యాగి వ్యాఖ్యలను ఖండించింది. నితీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండియా కూటమి సంప్రదించడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసునని చురక అంటించింది.