గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (09:51 IST)

కెనాడా వెళ్లేవారికి ట్రావెల్ అడ్వైజరీ... ప్రవాస భారతీయులు కూడా జాగ్రత్తగా ఉండాలి... కేంద్రం

Dr S Jaishankar
కెనడా దేశంలో నెలకొనివున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కేంద్రం ట్రావెల్ అడ్వైజరీనీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కెనడా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే, కెనడాలో ఉండే ప్రవాస భారతీయులు సైతం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కెనడాలోని పలు ప్రాంతాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న దృష్ట్యా జాగ్రత్త వహించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. 
 
నిషిద్ధ 'ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్' (కేటీఎఫ్) నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో మూడు నెలల క్రితం హత్యకు గురికావడం వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో చేసిన పెను వ్యాఖ్య దుమారం రేకెత్తించిన విషయం తెలిసిందే. 'రాజకీయ ప్రేరేపిత విద్వేష నేరాలు కెనడాలో పెరుగుతున్నాయి. భారత వ్యతిరేక ఎజెండాతో పనిచేస్తున్నవారిని వ్యతిరేకిస్తున్న మన దౌత్యవేత్తలు, ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ఘర్షణలు, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలవైపు వెళ్లవద్దు. 
 
అలాంటి పరిస్థితికి ఆస్కారం ఉన్నచోట్లకు ప్రయాణాలు మానుకోవాలి. కెనడాలోని భారతీయుల భద్రత, క్షేమం కోసం కెనడా దౌత్యవర్గాలతో మన హైకమిషన్, కాన్సులేట్లు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కెనడాలోని భారత పౌరులు ఒట్టావాలోని హైకమిషన్.. లేదా టొరంటో, వాంకోవర్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద తమ పేర్లను వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు నేరుగా, వేగంగా సంప్రదించేందుకు తద్వారా వీలవుతుంది' అని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.