గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (12:39 IST)

ఆగస్టులో జియో ఇమేజింగ్ శాటిలైట్ ప్రయోగం.. ఇస్రో ఏర్పాట్లు

జీశాట్ 1 జియో ఇమేజింగ్ శాటిలైట్‌ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనుంది. ఈ ప్రయోగం ఆగస్టు 12వ తేదీన జిఎస్ఎల్వి-ఎఫ్ 10 రాకెట్‌ ద్వారా జియో ఇమేజింగ్ ఉపగ్రహం జిశాట్ -1 కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని ఇస్రో భావిస్తోంది. 
 
ఈ ప్రయోగం 2021వ సంవత్పరంలో ఇస్రో జరపబోయే రెండో ప్రయోగం. బ్రెజిల్‌కు చెందిన ఎర్త్‌ ఆబ్సర్వేషన్‌ శాటిలైట్‌ అమెజోనియా -1తో పాటుగా మరో 18 శాటిలైట్లను పీఎస్‌ఎల్వీ- సీ51 రాకెట్‌తో గత ఫిబ్రవరి 28 రోజున ప్రయోగించింది. ఈ ప్రయోగంలో కొంతమంది విద్యార్థులు తయారుచేసిన శాటిలైట్లను కూడా అమర్చి నింగిలోకి పంపించారు. 
 
ఈ క్రమంలో 2,268 కిలోల బరువున్న జిశాట్‌-1 ఉపగ్రహాన్ని గత ఏడాది మార్చి 5 న ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభించడంతో జీశాట్‌-1 ప్రయోగం ఆలస్యమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 12 న ఉదయం 05.43 గంటలకు జీఎస్‌ఎల్‌వి-ఎఫ్ 10 లాంచ్‌  వెహికిల్‌తో జీశాట్‌-1ను ప్రయోగిస్తామని ఇస్రో అధికారులు శనివారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ఉపఖండ పరిశీలనకు దోహదపడుతుంది. జీశాట్-1ను జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్‌తో జియోసింక్రోనస్  కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం దేశ సరిహద్దుల రియల్‌ టైం చిత్రాలను అందిస్తోంది. 
 
అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలను త్వరగా పర్యవేక్షించటానికి వీలు కల్పిస్తుంది. ఆన్బోర్డ్ హై రిజల్యూషన్ కెమెరాలతో, భారతీయ భూభాగం, మహాసముద్రాలను, ముఖ్యంగా దాని సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతోందని ఇస్రో అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.