తమ్మారెడ్డి చెప్పింది నిజమే.. మరో టిడిపి పారిశ్రామికవేత్తపై ఐటీ పంజా..?
ఆపరేషన్ గరుడ నటుడు శివాజీ మొదట్లో చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి. కేంద్రం టిడిపి నేతల్ని టార్గెట్ చేస్తోంది. మొదటగా మంత్రులను టార్గెట్ చేసి ఆ తరువాత చంద్రబాబు నాయుడుకు ఉచ్చు బిగుస్తుందని చెప్పారు. చెప్పినట్లుగానే వరుసగా ఐటీ, ఇడీ దాడులు జరిగాయి. ఇదిలా ఉంటే నెల క్రితం నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా మరో 20 మంది టిడిపి నేతలు, టిడిపికి సపోర్ట్ చేసే పారిశ్రామిక వేత్తలపై దాడులు జరిగే అవకాశముందని ప్రకటించారు.
భరద్వాజ చెప్పినట్లుగానే నేటి ఉదయం నుంచి టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి చెందిన కంపెనీల మీద దాడులు కొనసాగిస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయపుపన్ను కట్టేలేదని మాగుంట శ్రీనివాసులరెడ్డిపై ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సిబ్బందిని మాత్రమే లోపల పెట్టి తనిఖీలు కొనసాగుతున్నాయి. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశముందని తెలుస్తోంది. అయితే వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు ఐటీ అధికారులు. ఐటీ అధికారులు మరోసారి దాడులు కొనసాగిస్తుండడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.