శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (10:00 IST)

అమ్మ మృతిపై నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నా: దిండుగల్ శ్రీనివాసన్

దివంగత సీఎం జయలలిత మృతి పట్ల వున్న అనుమానాలను అధికం చేస్తూ అటవీశాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్యంతో జయలలిత అపోలోలో చికిత్స పొందుతుండగా ఆమెను ఎవ్వరూ చూసేందుకు అనుమతించలేదు

దివంగత సీఎం జయలలిత మృతి పట్ల వున్న అనుమానాలను అధికం చేస్తూ అటవీశాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్యంతో జయలలిత అపోలోలో చికిత్స పొందుతుండగా ఆమెను ఎవ్వరూ చూసేందుకు అనుమతించలేదు. ఆ సందర్భంగా జయలలిక ఆరోగ్యం గురించి తాము చెప్పిన మాటలన్నీ అవాస్తవాలని.. ఆమె ఇడ్లీ తినలేదు.. పేపర్ చదవలేదని దిండుగల్ శ్రీనివాసన్ స్పష్టం చేశారు. 
 
ఆమెను చూసేందుకు వెళితే.. శశికళ వర్గం తమను ఓ గదిలో కూర్చుండబెట్టి మాట్లాడి పంపేసేవారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడులో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌‌ను ఆత్మరక్షణలో పడేశాయి. దిండుగల్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలను పావుగా ఉపయోగించుకుని విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. 
 
సీబీఐ విచారణ జరిపించాలని డీఎంకే నేత స్టాలిన్ సహా ఇతర పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జయ మేనకోడలు దీప తన అత్త మృతిపై కోర్టుకెళ్తానని ప్రకటించారు. అయితే దిండుగల్‌ శీనివాసన్‌ వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, జయలలిత అందించిన చికిత్సపైగానీ, ఆమె మృతిపైగానీ ఎటువంటి సందేహాలు లేవని రాష్ట్ర చేనేత మంత్రి ఓఎస్‌ మణియన్‌ అన్నారు. 
 
అయితే మంత్రి దిండుగల్‌ శీనివాసన్‌ మాత్రం తన మాటలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. అపోలో ఆస్పత్రిలో జయలలితను గవర్నర్ కూడా చూడలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవుల్లో ఉంటూ జయలలిత చికిత్సలకు సంబంధించి అసత్యాలను ప్రచారం చేశారని దీనిద్వారా సుస్పష్టమవుతోందని, కనుక కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు.