రిలయన్స్ జియో `డిజిటల్ ఉడాన్`... ఫేస్‌బుక్‌తో కలిసి అతిపెద్ద సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమం...
హైదరాబాద్: భారతదేశంలో భారీ సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. `డిజిటల్ ఉడాన్` పేరుతో చేపడుతున్న ఈ నూతన కార్యాచరణ ద్వారా, తొలిసారిగా ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారికి సాంకేతిక అక్షరాస్యత అందించడంతో పాటు ఇంటర్నెట్ గురించి అవగాహన కల్పించనుంది. 300 మిలియన్లకు పైగా ప్రజలను డిజిటల్ పథం వైపు జియో నడిపించగా ఇందులో తొలిసారిగా ఇంటర్నెట్ ఉపయోగించిన వారి సంఖ్యే అధికంగా ఉండటం విశేషం.
డిజిటల్ ఉడాన్ కార్యాచరణలో భాగంగా జియో, ప్రతి శనివారం జియో ఫోన్ వినియోగదారులతో అనుసంధానం అయి జియో ఫోన్ ఫీచర్లను వాడటం గురించి వారికి సహకరిస్తుంది. వివిధ రకాలైన యాప్‌లు ఉపయోగించడం, ఇంటర్నెట్ సురక్షిత విధానాలు మరియు జియో ఫోన్‌ను ఉపయోగించి మిత్రులు-స్నేహితులను సులభంగా, సురక్షితంగా మరియు భద్రతాపరంగా సౌకర్యవంతమైన రీతిలో అనుసంధానం అవడం గురించి తెలియజెప్పనుంది.
ఈ శిక్షణ ప్రక్రియను పది ప్రాంతీయ భాషల్లో శబ్ధ-దృశ్య రూపం (ఆడియో-విజువల్) రూపంలో అందించనుంది. ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేస్తున్న జియో డిజిటల్ ఉడాన్ కోసం రూపొందించిన వివిధ మోడ్యుళ్ళు ఆయా నగరాలు మరియు ప్రాంతాల వారికి తగిన రీతిలో ఉండనున్నాయి. ట్రైన్ ది ట్రైనర్స్ సెషన్లు, ట్రైనింగ్ వీడియోలు, మరియు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ల ద్వారా తగు శిక్షణ అందించనుంది.
తెలుగు సహా 10 ప్రాంతీయ భాషల్లో 13 రాష్ట్రాల్లోని 200 వివిధ లొకేషన్లలో దీనిని ప్రారంభించనున్నారు. ఈ విశిష్ట కార్యాచరణ 7000 ప్రాంతాలకు చేరువ అవటం ద్వారా మిలియన్ల కొద్ది జియో ఫోన్ యూజర్లు మరియు తొలిసారిగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న వారిని సాంకేతిక అక్షరాస్యులను చేయనుంది.
ఈ సందర్బంగా రిలయన్స్ జియో డైరెక్టర్ శ్రీ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ ``అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా భారతీయ వినియోగదారుల డిజిటల్ జీవన అనుభూతులను మరింత ఉత్తమంగా తీర్చిదిద్దాలని జియో నిరంతరం శ్రమిస్తోంది. ఈ క్రమంలో డిజిటల్ ఉడాన్ కార్యక్రమం ఒక ఉదాహరణ. సమాచారం రంగంలో ఉన్న వివిధ విజ్ఞాన సంబంధిత సమస్యలను దూరం చేయడం, రియల్ టైం యాక్సెసబిలిటీని అందించేందుకు దోహదపడనుంది.
సమాచారం మార్పిడి, విద్య మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన సమగ్రమైన వేదికగా రూపొందిన ఈ కార్యక్రమం వల్ల భారతీయుల్లో ఏ ఒక్కరూ కూడా డిజిటల్ డ్రైవ్ ప్రయోజనాలు పొందకుండా ఉండలేరు. భారతదేశంలోని ప్రతి పట్టణం మరియు నగరంలోకి దీనిని తీసుకువెళ్లేందుకు జియో కృషి చేస్తోంది. తద్వారా 100% సాంకేతిక అక్షరాస్యత సాధించేందుకు ప్రయత్నిస్తోంది`` అని అన్నారు.
ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అజిత్‌మోహన్ మాట్లాడుతూ, ``భారతదేశంలో డిజిటల్ విప్లవం ద్వారా మిలియన్ల కొద్ది భారతీయ ప్రజల జీవన విధానాలను మార్చడంలో మరియు ఇంటర్నెట్‌ను చేరువ చేయడంలో జియో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మిషన్‌లో ఫేస్‌బుక్ కలిసి నడుస్తోంది. జియోతో కలిసి నడుస్తుండటం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.