శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

దర్గా ఉర్సుకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు చేరిన భక్తులు

road accident
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఆగివున్న లారీని కారు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు దుర్మరణం పాలయ్యారు. మృతులను నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 13 మందికి గాయాలయ్యాయి. 
 
నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన కొందరు కలబురిగిలోని దర్గా ఉర్సుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరి జీపు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం యాదగిరి జిల్లాలో జరిగింది. ఆగివున్న లారీని జీపును బలంగా ఢీకొట్టడంతో దుర్ఘటన స్థలంలోనే ఐదుగురు మృత్యువాతపడగా, మరో 13 మంది గాయపడ్డారు. 
 
ప్రాణాలు కోల్పోయిన వారిలో మునీర్ (40), నయామిత్ (40), రమీజా బేగం (50), ముద్దతే షీర్ (12), సుమ్మి (13)లు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి  చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త తెలియగానే వెలుగోడులో విషాద చాయలు అలముకున్నాయి.