బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (09:10 IST)

కర్నాటక పొలిటికల్ క్రైసిస్... కుమారస్వామి ఎత్తులు.. షాకైన కమలనాథులు

కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. బెంగుళూరు కేంద్రంగా సాగుతున్నా ఈ రాజకీయాలు దేశ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారుకు తగినంత మెజార్టీ లేదని విపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. కానీ, తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని పేర్కొంటూ సభలో విశ్వాస తీర్మానాన్ని ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రవేశపెట్టారు. 
 
ఈ విశ్వాస తీర్మానంపై చర్చ ట్విస్టులపై ట్విస్టులు ఇస్తోంది. గత వారం ప్రారంభమైన ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. విశ్వాస చర్చను తక్షణం ముగించి బలనిరూపణ చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి కుమార స్వామికి ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేశారు. అలాగే, తక్షణం విశ్వాసపరీక్షను ముగించాలంటూ స్పీకర్ రమేష్ కుమార్‌కు గవర్నర్ ఇచ్చిన ఆర్డర్స్‌ను ఆయన కూడా పట్టించుకోలేదు. దీంతో విశ్వాస తీర్మాన చర్చ ఇంకా కొనసాగుతోంది. 
 
మరోవైపు, ముఖ్యమంత్రి కుమారస్వామి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. బెంగుళూరులోని అపోలో ఆస్పత్రిలో చేరినట్టు జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన అనారోగ్యంపాలుకావడానికి బీజేపీనే కారణమంటూ జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
మరోవైపు, సీఎం కుమార స్వామి అనారోగ్యంపై వస్తున్న వార్తలను బీజేపీ కొట్టిపారేసింది. ఇదంతా ఓ డ్రామా అంటూ మండిపడింది. విశ్వాసపరీక్ష నేపథ్యంలో కుమార స్వామి కొత్త ఎత్తుగడ వేశారంటూ కమలనాథులు ఆగ్రహం వ్యక్తంచేశారు.